Sunday 17 April 2011

అద్దె ఇల్లు

అద్దె ఇల్లు... ఇప్పుడు ఇదో పెద్ద సమస్యగా మారింది. బతుకు తెరువు కోసం వచ్చేవారు ఇంటికోసం పడుతున్న ఇబ్బందులెన్నో. పొద్దంతా ఎక్కడ తిరిగినా పర్వాలేదు. సాయంత్రం అయితే తల దాచుకోనేందుకు ప్రతీ ఒక్కరికి గూడు కావాల్సిందే. స్నేహితుడు కనికరిస్తే కొన్ని రోజులు గడిచిపోతాయి. మరి స్నేహితుళ్ళు లేని వారి పరిస్థితి ప్రారంభం నుంచి ఇబ్బంది కరమే. ఇల్లు దొరికే వరకు ఏ లాడ్జిలోనో, హాస్టల్ లోనో తలదాచుకోవల్సిందే. వాటిల్లోనూ ఎక్కువ మొత్తాన్ని వెచ్చించి ఎక్కువ రోజులు ఉండలేని పరిస్థితి. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొన్న మొత్తాన్ని లాడ్జిలకు పెట్టలేక... ఆ పరిస్థితినే ఊహించుకోలేక వెంటనే అద్దె ఇంటి వేటలో పడుతున్నారు. అయితే ఇక్కడ కూడా టులెట్ బోర్డ్ కనిపించడం లేదు. అంటే అద్దె ఇల్లు లేవా?. ఉన్నాయి. మరి బోర్డులు ఎందుకు లేనట్టు...


మునుపటి మాదిరిగా అద్దె ఇళ్ళ కోసం కాళ్ళరిగేలా తిరగడం దండుగ. ఎందుకంటే ప్రస్తుతం మధ్యవర్తులు వచ్చేశారు. కొత్త నిబంధనలు కూడా వచ్చేశాయి. అందుకే అద్దె ఇళ్ళు ఖాళీగా ఉన్నా సరే  టులెట్ బోర్డులు మాత్రం కనిపించవు. మరి విషయం ఎలా తెలుస్తుంది అనే కదా మీ అనుమానం. వెరీ సింపుల్... వీధుల్లో చిల్లర వ్యాపారం చేసుకొనే వాళ్ళని కదిలిస్తే చాలు అద్దె ఇల్లు ఎక్కడ ఉన్నాయో ఇట్టే తెలిసిపోతుంటాయి. ఇప్పుడు వాళ్ళే మధ్యవర్తులుగా వ్యవహరించడం అందుకు కారణం. అద్దె ఇళ్ళు కావాలంటే ముందుగా మద్యవర్తులకు రూ.100 ఇవ్వాల్సిందే. వాళ్ళు చూపించిన ఇంట్లో దిగితే నెల అద్దె మొత్తాన్ని వాళ్లకు సమర్పించుకోవాల్సిందే. ఇక ఇంటి యజమానులకు కనీసం పది నెలల బాడుగ ఇచ్చుకోవాల్సిందే.

అద్దె ఇళ్ళు ఉన్నా కూడా వెంటనే దొరకటం కష్టం. బ్రహ్మచారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఎంత ప్రాధేయ పడినా కూడా కనికరించే వారే కనిపించరు. ఇందుకు యజమానులు పలు కారణాలు చెబుతున్నారు. ఇళ్ళు సరిగ్గా పెట్టుకోరని, ఇద్దరని చెప్పి నలుగురు ఉంటారని, అదుపులేని ప్రవర్తనతో పక్కవారికి ఇబ్బంది కలిగిస్తారని చెబుతున్నారు. ఏదో కొద్ది మంది మాత్రం సవాలక్ష ఆంక్షలతో ఎక్కువ అద్దె తీసుకొని బ్రహ్మచారులకు ఇళ్ళు అద్దెకు ఇస్తున్నారు.

No comments:

Post a Comment