Sunday 17 April 2011

హెల్పింగ్ హార్ట్స్

అద్దె ఇల్లు

అద్దె ఇల్లు... ఇప్పుడు ఇదో పెద్ద సమస్యగా మారింది. బతుకు తెరువు కోసం వచ్చేవారు ఇంటికోసం పడుతున్న ఇబ్బందులెన్నో. పొద్దంతా ఎక్కడ తిరిగినా పర్వాలేదు. సాయంత్రం అయితే తల దాచుకోనేందుకు ప్రతీ ఒక్కరికి గూడు కావాల్సిందే. స్నేహితుడు కనికరిస్తే కొన్ని రోజులు గడిచిపోతాయి. మరి స్నేహితుళ్ళు లేని వారి పరిస్థితి ప్రారంభం నుంచి ఇబ్బంది కరమే. ఇల్లు దొరికే వరకు ఏ లాడ్జిలోనో, హాస్టల్ లోనో తలదాచుకోవల్సిందే. వాటిల్లోనూ ఎక్కువ మొత్తాన్ని వెచ్చించి ఎక్కువ రోజులు ఉండలేని పరిస్థితి. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొన్న మొత్తాన్ని లాడ్జిలకు పెట్టలేక... ఆ పరిస్థితినే ఊహించుకోలేక వెంటనే అద్దె ఇంటి వేటలో పడుతున్నారు. అయితే ఇక్కడ కూడా టులెట్ బోర్డ్ కనిపించడం లేదు. అంటే అద్దె ఇల్లు లేవా?. ఉన్నాయి. మరి బోర్డులు ఎందుకు లేనట్టు...


మునుపటి మాదిరిగా అద్దె ఇళ్ళ కోసం కాళ్ళరిగేలా తిరగడం దండుగ. ఎందుకంటే ప్రస్తుతం మధ్యవర్తులు వచ్చేశారు. కొత్త నిబంధనలు కూడా వచ్చేశాయి. అందుకే అద్దె ఇళ్ళు ఖాళీగా ఉన్నా సరే  టులెట్ బోర్డులు మాత్రం కనిపించవు. మరి విషయం ఎలా తెలుస్తుంది అనే కదా మీ అనుమానం. వెరీ సింపుల్... వీధుల్లో చిల్లర వ్యాపారం చేసుకొనే వాళ్ళని కదిలిస్తే చాలు అద్దె ఇల్లు ఎక్కడ ఉన్నాయో ఇట్టే తెలిసిపోతుంటాయి. ఇప్పుడు వాళ్ళే మధ్యవర్తులుగా వ్యవహరించడం అందుకు కారణం. అద్దె ఇళ్ళు కావాలంటే ముందుగా మద్యవర్తులకు రూ.100 ఇవ్వాల్సిందే. వాళ్ళు చూపించిన ఇంట్లో దిగితే నెల అద్దె మొత్తాన్ని వాళ్లకు సమర్పించుకోవాల్సిందే. ఇక ఇంటి యజమానులకు కనీసం పది నెలల బాడుగ ఇచ్చుకోవాల్సిందే.

అద్దె ఇళ్ళు ఉన్నా కూడా వెంటనే దొరకటం కష్టం. బ్రహ్మచారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఎంత ప్రాధేయ పడినా కూడా కనికరించే వారే కనిపించరు. ఇందుకు యజమానులు పలు కారణాలు చెబుతున్నారు. ఇళ్ళు సరిగ్గా పెట్టుకోరని, ఇద్దరని చెప్పి నలుగురు ఉంటారని, అదుపులేని ప్రవర్తనతో పక్కవారికి ఇబ్బంది కలిగిస్తారని చెబుతున్నారు. ఏదో కొద్ది మంది మాత్రం సవాలక్ష ఆంక్షలతో ఎక్కువ అద్దె తీసుకొని బ్రహ్మచారులకు ఇళ్ళు అద్దెకు ఇస్తున్నారు.

స్నేక్ మురుగన్

కోయంబత్తూరులోని ఉగ్గడంలో స్నేక్ మురుగన్ (46) పేరు తెలియని వారు ఉండరనడం బహుశా అతిశయోక్తి కాదేమో. అతను వీఐపీ కాదు కానీ, కళ్ళెదుట విష సర్పం కనిపించిన వాళ్లకు మాత్రం అతడు దేవుడితోనే సమానం. కారణం ఒక్క ఫోన్ చేస్తే చాలు ఆటో పట్టుకొని అయినా కొద్ది సేపట్లో అక్కడ వాలి పోవటంతో పాటు ఆ పాముని లాఘవంగా ఒడిసి పట్టుకుంటాడు. అంతటితో అంతా ఊపిరి పీల్చుకుంటే అతను మాత్రం ఆ పాము కోరల్లో నుంచి విషాన్ని తీసి జాగ్రత్తగా సమీపంలోని అడవిలో వదిలిపెడతాడు. ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన డబ్బు తీసుకుంటాడే తప్పా ఎవరినీ డిమాండ్ చెయ్యడు. కొన్ని సందర్భాల్లో తను వచ్చిన ఆటోకీ డబ్బులు ఇస్తే చాలు అనుకుంటాడు. పాములను పట్టడంతో అతని పేరుకు ముందు మురుగన్ చేరింది. ఆయనకు చదువు లేదు, అయితేనేం పాముల గురించి పాటశాలల విద్యార్థులకు ఎంచక్కా పాటాలు చెప్పుకు పోతాడు. వైద్య కళాశాల విద్యార్థులకు సైతం పాముల గురించి పాటాలు వల్లెస్తాడు. పాముల గురించి ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించి అనవసరంగా ప్రజలకు పాములు హాని తలపెట్టవని, మనకు కనిపించే పాములనీ అత్యంత విషపూరితం కావని చెబుతాడు. చిన్న తనంలో చెరువుల్లో ఈత కొట్టే సమయంలో బురద పాములు పట్టుకోవటంలో ఆసక్తి కనబరిచిన అతడు తర్వాత విష సర్పాలు పట్టుకోవటంలో కూడా ఆరితేరాడు. ఒకేసారిగా పదుల కొద్ది పాములు పట్టిన సందర్బాలు కూడా కోకొల్లలు. కోయంబత్తూరు వైశాల వీధిలోని D-1 పోలీసు స్టేషన్ భవనాన్ని మరొక చోటికి మార్చే సమయంలో పాములు గుంపులుగా బయట పడ్డాయి. ఆ సమయంలో ఆయన వాటిని పట్టుకొని అడవిలో వదిలిపెట్టాడు. అలాగే స్థానిక కలెక్టరు కార్యాలయం ఆవరణలోనూ, ఇతర ప్రభుత్వ అధికారుల ఇళ్ళలోనూ పాములను పట్టుకున్నాడు. ఇప్పటి వరకు ఆయన సుమారు 25 వేల పాములను పట్టుకున్నానని చెబుతాడు. అలాగే పాము కాటుకు గురైన 25 మందిని రక్షించానని కూడా చెబుతాడు. సుమారు 12 నుంచి 18 అడుగుల పొడవైన పాములను కూడా పట్టుకోవడంలో దిట్ట. స్నేక్ మురుగన్ నిస్వార్థంగా చేస్తున్న సేవకుగాను ఒకప్పటి కోయంబత్తూరు పొలిసు డిప్యూటి కమిషనరు షణ్ముగవేల్ ఆయన్ను సత్కరించారు కూడా. అలాగే పలు ప్రసంశా పత్రాలు కూడా అందాయి. స్నేక్ మురుగన్ కు  లక్ష్మి (36) అనే భార్య, కార్తి (16) అనే కుమారుడు, గౌరీ (15) అనే కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఉగ్గాడంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు.

మీరు కోయంబత్తూరు పరిసరాల్లో ఉంటే ఆయన్ను 093455 04865 సెల్ ఫోన్ ద్వారా పిలువవచ్చు.